నేతన్నకు సర్కారు భరోసా

నేతన్నకు సర్కారు భరోసా

telangana2018-03-10 13:23:56
Share Tweet Google+ Instagram

గత ప్రభుత్వాలు చేనేత రంగాన్ని పట్టించుకోలేదని, ఫలితంగా నేతన్నల ఆత్మహత్యలు పెరిగాయని ఐటీ, చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి చేనేత కార్మికులకు తమ ప్రభుత్వం భరోసానిస్తుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత సహకార సంఘాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలసి మంత్రి పరిశీలించారు. అందులో పని చేస్తున్న కార్మికుల జీవన స్థితిగతులపై ఆరా తీశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ.1,200 కోట్లు కేటాయించి తమ ప్రభుత్వం చరిత్రలో నిలిచిందన్నారు.

వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో చేనేత కార్మికులకోసం చేపడుతున్న అపెరల్, టెక్స్‌టైల్‌ పార్క్‌ల తరహాలో దుబ్బాకలో కూడా ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నూలు, రసాయనాలు, ఇతర ముడిసరుకులను 50 శాతం సబ్సిడీపై చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తుందన్నారు. అలాగే చేనేత కార్మికులు ఉత్పత్తి చేస్తున్న వస్త్రాలకు ప్రభుత్వమే మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తుందన్నారు. మరుగునపడుతున్న చేనేత వస్త్రాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి, నైపుణ్యాలను వెలికి తీయడానికే రాష్ట్ర ప్రభుత్వం చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌గా సినీ నటి సమంతను నియమించిందన్నారు. రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేనేత, పవర్‌లూమ్‌లకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తోందన్నారు. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని అక్కడున్న అధికారులకు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మంత్రి సూచించారు. దీంతో చేనేత కార్మికులకు పరోక్షంగా ఉపాధిని ఇచ్చినవాళ్లమవుతామన్నారు. 

Related Articles

Leave a reply