కొహినూర్ వజ్రం,నవాబ్ అలి నవాజ్ జంగ్ బహాదూర్

కొహినూర్ వజ్రం,నవాబ్ అలి నవాజ్ జంగ్ బహాదూర్

technology2017-08-11 12:33:31
Share Tweet Pin it

-రచయిత శ్రీధర్ రావు దేశ్ పాండే

ఇది తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న రోజుల నాటి ముచ్చట. ప్రభుత్వంలో పనిచేస్తున్న అన్ని ఇంజనీరింగ్ శాఖల ఇంజనీర్లు సంఘటితమై తెలంగాణ ఇంజనీర్స్ ‘ జె ఎ సి ’ ని ఏర్పాటు చేసుకున్నారు. అంతకు ముందే తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ఏర్పాటై పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకై , డిండీ ఎత్తిపోతల పథకంకై ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ లెజెండరీ ఇంజనీర్ నవాబ్ అలి నవాజ్ బహాదూర్ గురించి ఆయన జన్మదినం 11 జూలై న తెలంగాణ ఇంజనీర్స్ డే గా , ఆయన వర్దంతి రోజు 6 డిసెంబరు న తెలంగాణ ఇంజనీర్ల సంస్మరణ దినం జరుపుకోవడం ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో తెలంగాణ ఇంజనీర్ల ఫోరం ప్రధాన కార్యదర్శి శ్రీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒక ఇంజనీరింగ్ కాలేజికి వక్తగా వెళ్ళినారు. ఆయన తన ప్రసంగం ప్రారంభించే ముందు విద్యార్తులని , అధ్యాపకులని కొన్ని ప్రశ్నలు వేసినారు.మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎవరో మీకు తెలుసా ? అందరూ భారత రత్న అవార్డ్ పొందిన ఏకైక ఇంజనీర్ . ఆయన జన్మదినం 15 సెప్టెంబరున దేశ వ్యాప్తంగా ఇంజనీర్స్ డే గా జరుపుకుంటారు అని అందరూ ముక్త కంఠంతో జవాబు ఇచ్చినారు.

ఆర్థర్ కాటన్ ఎవరో తెలుసా ? గోదావరి నదిపై ధవళేశ్వరం బ్యారేజీని నిర్మించిన బ్రిటిష్ ఇంజనీర్ అని అందరూ చెప్పినారు ( వీరిద్దరు తెలుగు తేజో మూర్తుల్లో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కొలువుదీరి ఉన్నారు)మరో ప్రశ్న . నిజాంసాగర్ ప్రాజెక్టు ను నిర్మించిన ఇంజనీర్ ఎవరో తెలుసా ? అందరూ మౌనం వహించినారు. మరో ప్రశ్న. నవాబ్ అలి నవాజ్ జంగ్ బహాదూర్ ఎవరో మీకు తెలుసా ? ఒక్కరూ జవాబు చెప్పలేదు. మన చరిత్ర మనకు కాకుండా పోయింది. మన వాళ్ళు ఎవరో , మన జాతి నిర్మాతలు , మన వైతాళికులు ఎవరో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. మన చరిత్ర మనకు అందకుండా పోయింది. అందుకే తెలంగాణ కావాలి అని చెబుతూ సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని , ఆంధ్రా వలస పాలకుల వివక్షని , స్వాతంత్ర్యానికి పూర్వం హైదరాబాద్ రాజ్యంలో అలీ నవాజ్ జంగ్ కృషిని వివరిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించినారు.

ఇక్కడ ఆ ముచ్చటని ఎందుకు ప్రస్తావించవలసి వస్తున్నదంటే …ఆనాడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ గురించి ఎవరికీ తెలియక పోయినా ఇప్పుడు తెలంగాణ యువతకి నవాబ్ అలి నవాజ్ జంగ్ బహాదూర్ గురించి బాగా తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జి ఓ నంబరు 18 తేదీ 10.7.2014 న జారీ చేసి అలీ నవాజ్ జంగ్ బహాదూర్ జన్మ దినం జూలై 11 ను తెలంగాణ ఇంజనీర్స్ డే గా ప్రకటిచింది. తెలంగాణ సభ్య సమాజం పులకించి పోయింది. మూడు సంవత్సారాలుగా జూలై 11 న అధికారికంగా రాష్ట్ర వ్యాపితంగా తెలంగాణ ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నారు. ఆయన స్మారక చిహ్నాలు వెలుస్తున్నాయి. సాగునీటిశాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో ఆయన విగ్రహాన్ని మంత్రి హరీశ్ రావు 11 జూలై 2014 న ఆవిష్కరించినారు. మహబూబ్ నగర్ లో ఇర్రిగేషన్ శాఖ కొత్త భవనంలో ఆయన విగ్రహం ప్రతిష్టించబడింది. ఆయన పేరుమీద వివిధ శాఖల్లో విశిష్ట సేవలు అందించిన వెటరన్ ఇంజనీర్లకు “ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదూర్ మెమోరియల్ లైఫ్ టైం అవార్డు “ 2015 సంవత్సరం నుంచి ప్రదానం చెయ్యడం ప్రారంభమయ్యింది. హిమాయత్ సాగర్ లో ఉన్న వాలంటరీ ఇంజనీర్లు , ఉద్యోగులు కలిసి ప్రాంగణంలో ఆయన విగ్రహ ప్రతిష్టాపన చేసి 2016 జూలై 11 ఆవిష్కరించినారు.

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఆయనకు దక్కిన ఒకే ఒక గౌరవం ఖైరతాబాద్ లోని ఇన్స్టిట్యుషన్ ఆఫ్ ఇంజనీర్స్ కాన్ఫరెన్స్ హాల్ లో ఆయన చిత్రపటం వేలాడ దియ్యడం. 2013 లో తెలంగాణ ఇంజనీర్స్ చొరవ , కృషి వలన నిజాంసాగర్ డ్యాం వద్ద గుల్దస్త్ గార్డెన్ లో ఆయన నిలువెత్తు విగ్రహాన్నిప్రతిష్టించడం. రెండేండ్లుగా పత్రికల్లో, టీవీల్లో ఆయనపై అనేక ప్రత్యేక కథనాలు ప్రచురించి , ప్రసారం చేసి అలి నవాజ్ జంగ్ గారికి విస్తృత ప్రచారాన్ని కల్పించినారు. ఈనాటి తరానికి ఆయన గురించి తెలియజెప్పినారు.
ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందువలన సాధ్యం అయ్యింది. మన అస్తిత్వాన్ని, మన చరిత్రని పునరుద్దరించుకోవడం సాధ్యం అవుతున్నది. మన పాఠ్య పుస్తకాల్లో మన చరిత్ర , సంస్కృతి , మన వైతాళికుల జీవిత చరిత్రలు , మన రచయితల , కవుల రచనలని విస్తృతంగా పొందుపర్చగలుగుతున్నాము. దేశ వ్యాప్తంగా మన కళా వైభవాన్ని సూరజ్ కుండ్ మేళాలో చాటి చెప్పగలిగినాము. ఘనమైన తెలంగాణ చరిత్రను పబ్లిక్ సర్వీస్ పరీక్ష సిలబస్ లో అనివార్యం చెయ్యగలిగినాము. మన చరిత్ర అన్వేషణ వేగవంతమయ్యింది. గత 15 ఏండ్లుగా మన అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకునే క్రమంలో భాగంగా తెలంగాణ చరిత్ర పరిశోధకులు పలుగూ పారా పట్టుకొని చరిత్ర పురా తవ్వకాలు జరిపినారు. కాలం మట్టి దిబ్బల కింద కప్పెట్టబడిన మన చరిత్రని తవ్వి తీసి ప్రపంచానికి తెలియజెప్పినారు.

మన జాతి నిర్మాతలని , మన వైతాళికులను ఎందరినో వెలుగులోనికి తీసుకురాగలిగినారు. ఆ తవ్వకాల్లో బయటపడిన కోహినూర్ వజ్రమే అలి నవాజ్ జంగ్ బహాదూర్. తెలంగాణ సాగునీటి రంగ పితామహుడు – నవాబ్ అలి నవాజ్ జంగ్ బహాదూర్ “ పేరుతో ఒక చిన్న పుస్తకాన్ని 2013 జూలై లో అచ్చువేసినాము. ఆ తర్వాత 2015 జూలై లో మరికొంత సమాచారాన్ని , ఫోటోలని చేర్చి రెండో ప్రచురణ వెలువరించినాము. పుస్తకానికి అధ్బుతమైన ప్రజాదరణ లభించింది. 2014 లో ఉర్దూలోకి అనువాదమై ముస్లిం ప్రజానీకంలోనికి కూడా వెళ్ళింది.

ఏ జాతికైనా వైతాళికులు ఉంటారు తమ జాతి ఔన్నత్యం కోసం , వికాసం కోసం అహర్నిషలు కృషి చేసిన ఉద్దారకులు , మేధావులు ఉంటారు ? అయితే వలసవాదానికి బలి అయిన తెలంగాణ వంటి ప్రాంతాల్లో ఈ చరిత్ర అంతా మరుగునపడిపోతుంది. చరిత్ర వక్రీకరణకు గురి అవుతుంది. విజేతల చరిత్రే చరిత్ర అన్నట్లు పుస్తకాలు , పాఠ్యపుస్తకాలు రూపొందుతాయి. అట్లా 1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణ చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనుంచి లేదా తెలుగువారి చరిత్రలో నుంచి తొలగిపోయి మరుగున పడిపోయింది. తెలంగాణ నేలమీద తెలుగు సామ్రాజ్యాలు విలసిల్లినాయి.

ఘనమైన చరిత్ర ఈనేలకు ఉన్నది. ప్రత్యేకమైన భాషా సాంస్కృతిక అస్తిత్వం ఉన్నది. తెలంగాణ అనేక రాజకీయ , సామాజిక ఉద్యమాలకు ఊతమిచ్చిన నేల. 1857 లో తుర్రేబాజ్ ఖాన్ , మౌల్వీ అల్లావుద్దీన్ బ్రిటిష్ వారిపై చేసిన పోరాటం ఎవరికీ తెలియకుండా పోయింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి అమరుడైన రాంజీ గోండు పోరాటం , గ్రామాలపై , అడవిపై హక్కుల కోసం నిజాం ప్రభుత్వం పై పోరుసలిపి అమరుడైన కొమురం భీం బాబేఝరి పోరాటం ఇటీవలిదాకా ఎవరికీ తెలియనే తెలియదు. భూస్వామ్య వ్యతిరేక మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని మెయిన్ స్ట్రీం చరిత్రకారులు గుర్తించనే లేదు. తెలంగాణలో బాషా సాంస్కృతిక వికాసం కోసం కృషి చేసిన అనేక మంది వైతాళికులను మన చరిత్రకారులు వెలికి తీసే దాకా ఎవరికీ తెలియనే తెలియదు. అట్లా మరుగున పడిపోయిన వైతాళికుల్లో నవాబ్ అలి నవాజ్ జంగ్ బహాదూర్ ఒకరు. హైదరాబాద్ రాజ్యంలో పుట్టి భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన ఇంజనీర్ గా ప్రఖ్యాతిగాంచినాడు.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి దేశ వ్యాప్తంగా తెలియనివారు ఉండరు. భారత దేశం గర్వించదగిన ఇంజనీరు , దార్శనికుడు, పరిపాలనాదక్షుడు , భారతరత్న బిరుదాంకితుడు , దేశంలో సాగునీటి రంగానికి పునాదులు వేసిన తొలితరం మేధావి విశ్వేశ్వరయ్య. అటువంటి మేధావికి సమకాలికుడు, అంతే స్థాయికలిగిన ప్రతిభావంతుడైన ఇంజనీర్ అలి నవాజ్ జంగ్ బహాదూర్. అయితే ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగ చరిత్రలో సర్ ఆర్థర్ కాటన్ కు , డా. కె ఎల్ రావుకు దక్కిన స్థానం , ఖ్యాతి అలి నవాజ్ జంగ్ కు దక్కలేదు. ఇది యాదృచ్చికం కానే కాదు. ఆ మరుపు అంతర్గత వలసవాదం యొక్క ప్రభావ ఫలితమే. కృష్ణా , గోదావరీ , కావేరీ డెల్టాలకు సాగునీటి సౌకర్యాలని ఏర్పరచి డేల్టా ప్రాంతాల ఆర్థిక స్థితిగతులని గుణాత్మకంగా మార్చివేసిన కాటన్ కు ఆ ఖ్యాతి దక్కవలసిందే . అయితే కాటన్ మహాశయుడి తరహాలోనే దక్కన్ పీఠ భూమిలో భాగమైన హైదరాబాద్ రాజ్యంలో ఈ ప్రాంత భౌగోళిక స్థితిగతులకు అనుగుణంగా సమగ్ర సాగునీటి ప్రణాళికలు రచించి అనేక భారీ , మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులని , అనేక చారిత్రిక భవానాలని, వంతెనలని , రోడ్లని నిర్మించినవాడు అలి నవాజ్ జంగ్ బహాదూర్ కు అటువంటి ఖ్యాతి దక్కవలసింది. ఆయన మహోన్నత కృషిని స్మరించుకున్న సందర్భాలు ఇటీవలి దాకా లేనే లేవు. తెలంగాణ ఉద్యమ చైతన్యంలో తెలంగాణ ఇంజనీర్లు తమ ఘనమైన చరిత్రని తెలుసుకున్నారు.

ఆ ఎరుకలో నుంచే జూలై 11 న తెలంగాణ ఇంజనీర్స్ డే జరుపుకొనే సాంప్రదాయాన్ని నెలకొల్పినారు. తెలంగాణ రాష్ట్రం జూలై 11 ని తెలంగాణ ఇంజనీర్స్ డే గా ప్రకటించడం ఆయనకు దక్కిన శాశ్వత సముచిత గౌరవం.
ఇంతకూ ఆయన హైదరాబాద్ రాజ్యానికి , తెలంగాణ సమాజానికి, దేశానికి అందించిన సేవలు ఏమిటి? సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే హైదరాబాద్ రాజ్యం భారత దేశంలో విలీనం జరిగేనాటి ఇక్కడ నిర్మాణం అయిన భారీ మధ్యతరహా ప్రాజెక్టులు అన్నీ అలి నవాజ్ జంగ్ రూపకల్పన చేసి నిర్మించినవే. నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ , పోచారం ప్రాజెక్టులు , ఖమ్మం జిల్లాలో వైరా , పాలేరు ప్రాజెక్టులు ,కరీంనగర్ జిల్లాలో అప్పర్ మానేరు ప్రాజెక్టు , మహబూబ్ నగర్ జిల్లాలో డిండీ , సింగభూపాలెం , రాయనిపల్లి, కోయిల్ సాగర్ ,తుంగభద్ర ప్రాజెక్టులు , ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు లు, హైదరాబాద్ లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు ఆయన జీవించిన కాలంలో నిర్మాణం అయినాయి.

ఆయన మరణానంతరం ఆయన రూపకల్పన చేసిన ప్రాజెక్టులు నిర్మాణానికి నోచుకున్నవి. నల్లగొండ జిల్లాలో మూసీ ప్రాజెక్టు , నాగార్జునసాగర్ ప్రాజెక్టు ( నందికొండ ), పెండ్లిపాకల ప్రాజెక్టు , మహబూబ్ నగర్ జిల్లాలో రాజోలి బండ డైవర్షన్ స్కీం ,సరళాసాగర్ ప్రాజెక్టులు, నిజామాబాద్ –ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి నదిపై పోచంపాడ్ ప్రాజెక్టు , మరాఠ్వాడాలో పూర్ణా ప్రాజెక్టు , మెదక్ జిల్లాలో ఘన్ పూర్ ఆనకట్ట మొదలైనవి అలి నవాజ్ జంగ్ రూపకల్పన చేసినవే. ఇచ్చంపల్లి ,పెన్ గంగ ప్రాజెక్టులని ఆయనే రూపకల్పన చేసినప్పటికీ అవి గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అవి సాకారం కాలేదు. అవి రెండూ పర్యావరణ , ముంపు సమస్యలతో సతమతమవుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల సంగతి అట్లా ఉంచితే ఆయన అనేక చారిత్రిక భవనాలని నిర్మించినాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ , హాస్టల్ భవానాలు , ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ,ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్, పబ్లిక్ గార్డెంన్ లోని జూబిలీ హాల్ , అఫ్జల్ గంజ్ లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ , మహబూబియా బాలికల పాఠశాల, నాందేడ్ సివిల్ ఆసుపత్రి , చార్మినార్ వద్ద యునానీ ఆసుపత్రి ఆయన నిర్మించినవే. హైదరాబాద్ రాజ్యంలో పెద్ద నదులపై రాతివంతెనలు నిర్మించినాడు.

ఆదిలాబాద్ జిల్లా సోన్ గ్రామం వద్ద గోదావరిపై రాతి వంతెన , గుల్బర్గ జిల్లా యాద్గిర్ వద్ద భీమా నదిపై రాతివంతెన ,నిజామాబాద్ జిల్లా బండపల్లి వద్ద మంజీరా నదిపై రాతి వంతెన ,ఖమ్మం జిల్లా మున్నేరు నదిపై రాతి వంతెన ,ఔరంగాబాద్ వద్ద శాఘడ్ వద్ద ఆర్ సి సి వంతెన, మహబూబ్ నగర్ జిల్లాలో అనగండ వద్ద కృష్ణా నదిపై రాతి వంతెన , రాయచూర్ జిల్లాలో తుంగభద్ర నదిపై రాతివంతెన వీటిలో కొన్ని.ఈ కట్టడాల సంగతి అటుంచితే ఇంజనీరింగ్ మేధావిగా ఆయన రూపొందించిన ఇంజనీరింగ్ నివేదికలు అపురూపమైనవి. దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు భారత జాతీయ కాంగ్రేస్ దేశ అభివృద్ది పథకాలపై నివేదికలు తయారు చేయడానికి నెహ్రూ అధ్యక్షతన 1938 లో నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వివిధ అంశాలపై నిపుణులతో సబ్ కమిటీలు ఏర్పాటు చేసింది. అటువంటి సబ్ కమిటీల్లో సాగునీటి రంగంలో సమగ్ర నివేదికను తయారు చెయ్యడానికి అలి నవాజ్ జంగ్ నే నెహ్రూ ఎన్నుకున్నాడు. అప్పటికి హైదరాబాద్ రాజ్యం ఇంకా భారత్ లో విలీనం కానేలేదు. అప్పటికే ఆయన ప్రతిభావంతుడైన ఇంజనీర్ గా దేశంలో గుర్తింపు పొందినాడు. “ రివర్ ట్రైనింగ్ & ఇర్రిగేషన్ ’’ పేరుతో ఆయన సిఫారసులతో కూడిన సమగ్ర నివేదికను రెండేండ్లలోనే సమర్పించినాడు. స్వాతంత్ర్యానంతరం నెహ్రూ ఆ సిఫారసులను అమలు చేసినాడు. ఆయన సిఫారసుల మేరకే దిల్లీలో సెంట్రల్ వాటర్ కమీషన్ , సెంట్రల్ ఎలెక్ట్రిసిటీ అథారిటీ , పూణేలో సెంట్రల్ వాటర్ & పవర్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటు అయినాయి. దేశంలో అన్ని నదులపై గేజింగ్ స్టేషన్ లు, దేశ వ్యాప్తంగా వర్షపాతాన్ని నమోదు చెయ్యడానికి రెయిన్ గేజ్ స్టేషన్ లు ఏర్పాటు అయినాయి. అన్ని ప్రధాన నదులపై భాక్రా నంగల్ , హీరాకుడ్ ,దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు , నాగార్జునసాగర్ లాంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం జరిగినాయి. అలి నవాజ్ జంగ్ కలలు ఆయన మరణానంతరం నిజమయినాయి.

సివిల్ ఇంజనీరింగ్ విధ్యార్థులకు హైడ్రాలజీ ఒక ప్రధానమైన సబ్జెక్టు. గరిష్ట వరద పరిమాణాన్ని లెక్క గట్టడానికి యూరోపియన్ ఇంజనీర్లు రూపొందించిన ఎంపెరికల్ ఫార్ములాలు ఒక పాఠంలో బోదిస్తారు. డికెన్స్ ఫార్ములా , రైవ్స్ ఫార్ములా, గేగ్స్ ఫార్ములా , ఇంగ్లిస్ ఫార్ములా ఇట్లా కొన్ని ఫార్ములాలు ఉన్నాయి. వీటి సరసన అలి నవాజ్ జంగ్ రూపొందించిన ఫార్ములా ఆయన పేరు మీద చోటు చేసుకున్నది. హైడ్రాలజీ , హైడ్రాలిక్స్ లో అలి నవాజ్ జంగ్ కు శాస్త్ర జ్ఞానంతో పాటు అనుభవ జ్ఞానం కూడా ఉన్నది.
హైదరాబాద్ రాజ్యంలో అన్నినదులపై , వాగులపై హైడ్రాలాజికల్ సర్వేలు చేసి ఉన్నాడు. ఆ అనుభవంతో సాంప్రదాయికంగా ఉపయోగించే డికెన్స్ , రైవ్స్ ఫార్ములాలతో గరిష్ట వరద పరిమాణాన్ని అంచనా కట్టినప్పుడు వాస్తవ వరద పరిమాణంతో పోల్చి చూస్తే పెద్ద అంతరం ఆయన గమనించినాడు. ఇది డ్యాం నిర్మాణ ఖర్చును పెంచుతుంది. దక్కన్ పీఠ భూమిలో ఉన్న నదులపై వాటి పరివాహక ప్రాంత స్థితిగతులకు సరిపోయే విధంగా ఫార్ములాను అలి నవాజ్ జంగ్ రూపొందించినాడు. తను రూపొందించిన ఫార్ములా యొక్క సమర్థతను డిండీ ప్రాజెక్టులో ప్రయోగించి నిరూపించినాడు.

సివిల్ ఇంజనీరింగ్ సైన్స్ కు ఈ ఫార్ములా అలి నవాజ్ జంగ్ ఇచ్చిన గొప్ప కాంట్రిబ్యూషన్ గా నిపుణులు భావిస్తారు. అయితే గరిష్ట వరద ప్రవాహాన్ని లెక్క గట్టడానికి యూరోపియన్ ఇంజనీర్లు రూపొందించిన ఫార్ములాలనే బహుశా ఖర్చు ఎక్కువైనా సేఫ్ గా ఉంటుందని అనుకోవడం వలన భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అలి నవాజ్ జంగ్ రూపొందించిన ఫార్ములాను కాలానుగుణంగా అప్ డేట్ చేసే పరిశోధనలు ఏవీ జరగకపోవడం అలి నవాజ్ జంగ్ కి అన్యాయం చేసినట్లేనని భావించాలి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని నదులపై విస్తృతంగా హైడ్రాలాజికల్ డాటా .. అనగా వర్షపాతం , వరద ప్రవాహం తదితర సమాచారం లభ్యమవుతున్నది. ఈ డాటా అధారంగా అలీ నవాజ్ జంగ్ ఫార్ములాను మరింత సమగ్రంగా రూపొందించే కృషి జరగాల్సి ఉన్నది. ముఖ్యంగా దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణలో ఉన్న ఉస్మానియా , జె ఎన్ టి యు ( హె చ్ ) ఇప్పటికైనా ఈ ఫార్ములాను అప్డేట్ చేసే పరిశోధనలకు పూనుకోవాలి. అలి నవాజ్ జంగ్ ఫార్ములా యొక్క విశ్వసనీయతను స్థిరపర్చాలి.

అలి నవాజ్ జంగ్ తన జీవిత కాలంలో అనేక ఉన్నత పదవులను సమర్థవంతంగా నిర్వహించినాడు. దేశంలో ఆనాడు యూరోపియన్ ఇంజనీర్లకే చీఫ్ ఇంజనీర్ పదవులు లభించేవి .హైదరాబాద్ రాజ్యంలో కూడా వారే ఇంజనీరింగ్ శాఖలకు చీఫ్ ఇంజనీర్లుగా నియమితులయ్యేది. వారి అధిపత్యాన్ని అధిగమించి ఆయన ప్రజా పనుల విభాగానికి చీఫ్ ఇంజనీర్ గా ఆ తర్వాత సెక్రేటరీగా పదోన్నతి పొందినాడు. అందుకు ఆయన చూపిన అసాధారణ ప్రతిభ , ఆయన వద్ద ఉన్న మ్యాథమేటికల్ టూల్స్ కారణం. దేశంలో అనేక ప్రావిన్సుల నుండి సాంకేతిక సమస్యలని పరిష్కరించడానికి ఆహ్వానించేవారు. దేశంలోనే ఆయన మొదటి స్వదేశీ చీఫ్ ఇంజనీర్. హైదరాబాద్ ప్రజా పనుల శాఖకు చీఫ్ ఇంజనీర్ – సెక్రెటరి గా ఎంపిక అయినప్పుడు ఆయనకు చార్జీ అప్ప జెప్పిన హైదరాబాద్ రాజ్య చివరి బ్రీటిష్ చీఫ్ ఇంజనీర్ ఎ టి. మెకంజీ అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం సముచితం . “ నేను నా భాధ్యతలను నాకంటే ప్రతిభావంతుడైన , నా కంటే గొప్ప పరిపాలనాదక్షుడికి అప్పజెపుతున్నాను ’’ యూరోపియన్ చీఫ్ ఇంజనీర్ల గౌరవాన్ని ,అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి అలీ నవాజ్ జంగ్. నవాబ్ చత్తారీ ప్రధానమంత్రి పదవికి రాజీనామా సమర్పించినప్పుడు కొత్త ప్రధాన మంత్రి పదవికి అలీ నవాజ్ జంగ్ పేరుని కూడా నిజాం మీర్ ఉస్మాన్ ఖాన్ పరిశీలించినట్లు హైదరాబాద్ రాజ్య చివరి ప్రధానమంత్రి మీర్ లాయక్ అలీ “ ట్రజెడీ ఆఫ్ హైదరాబాద్ “ పుస్తకంలో పేర్కొన్నాడు. అయితే హైదరాబాద్ రాజ్యానికి చివరి ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచిపోయే ఒక విషాదం నుంచి ఆయన తప్పించుకున్నాడు.

ఇక చివరగా.. జూన్ 2 , 2014 నవ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. జూన్ 6 న జూలై 11 ని తెలంగాణ ఇంజనీర్స్ డే గా ప్రకటించమని తెలంగాణ ఇంజనీర్స్ జె ఎ సి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ సమర్పించింది. దాన్ని గౌరవ సాగునీటి శాఖా మంత్రి హరీశ్ రావుగారు ముఖ్యమంత్రికి సిఫారసు చేస్తూ ఫైలు పంపినారు. జూలై 9 సాగునీటి శాఖపై గౌరవ ముఖ్యమంత్రి సమీక్షకు పిలిచినప్పుడు ఫైలు గురించి ఆయనకు గుర్తు చేసినాను. కె సి ఆర్ గారు వేంటనే తన కార్యాలయం నుంచి ఫైలుని తెప్పించుకొని సంతకం చేసినారు. జూలై 10 న జి ఓ జారీ అయ్యింది. జూలై 11 న అలీ నవాజ్ జంగ్ జన్మదినాన్ని అధికారికంగా తెలంగాణ ఇంజనీర్స్ డే గా జలసౌధలో ఘనంగా నిర్వహించుకున్నాము. జలసౌధలో అలీ నవాజ్ జంగ్ విగ్రహాన్ని మంత్రి హరీశ్ రావు సగర్వంగా ఆవిష్కరించినారు. అలి నవాజ్ జంగ్ స్పూర్తిని , వారసత్వాన్ని కొనసాగించాలని పిలునిచ్చినారు. ఆనాటి సభలో తెలంగాణ ఉద్యమంలో నీళ్ళల్లో నిప్పులు రగిలించిన ఆర్ విద్యాసాగరరావుని ఘనంగా సన్మానించుకున్నాం. వలసవాద చరిత్ర అలీ నవాజ్ జంగ్ కు చేసిన అన్యాయాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన ఒక్క నెలలోనే సవరించింది. అది ఆయనకు అంతిమంగా లభించిన పోయెటిక్ జస్టిస్. మంత్రి హరీశ్ రావు గారికి , ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి తెలంగాణ ఇంజనీర్లందరితరపున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణని కోటి ఎకరాల మాగాణంగా మలచడానికి తెలంగాణ ఇంజనీర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అదే అలీ నవాజ్ జంగ్ గారికి అర్పించే నిజమైన నివాళి.

జయరాజ్… వానమ్మ వానమ్మ !

ఓ వానమ్మ ఒక్కసారి రావమ్మ…నీ అవుసరం మాకేకాదు… శేను శెల్కకు శెట్టుకు శేమకు,పశువులకు పంటలకు మొత్తం ప్రకృతికే నువ్వు కావాలి …వానమ్మ వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ అంటూ తన గొంతును వినిపించి…చెట్టు పుట్టలను పాటల్లో ఒంపుకొని పల్లెతల్లిని పలకరించినోడు జయరాజన్న.ఆ పాటలో ఉన్న అనుభూతి అంతా ఇంతా కాదు..వాగుల్లో వంకల్లో..శేనుల్లో శెలకల్లోనేకాదు నిన్ను నమ్ముకున్న రైతు కళ్లలో కూడా నీళ్లు లేవు,సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఏడ్వవట్టే…నీళ్లు వోసుకున్న చేను నీళ్లాడకపాయే…వర్షంరాకపోతే ప్రకృతికూడా ఎంత తల్లడిల్లుతుందో ఈ పాటలో అద్బుతంగా చెప్పారు.

విమలక్క..చినుకు..చినుకు..!

చినకు చినుకు కురిసిన నేలల శిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పెల్ల వాసన..మన్ను మిన్ను తల్లి బిడ్డలని వానజల్లు కలిపెనో…ఇలా వర్షం గురించి విమలక్క తనదైన శైలిలో అభివర్ణించారు.

ఇలా సినిమా సాహితీకారులు ఓ వైపు,ప్రజా వాగ్గేయకారులు మరోవైపు వర్షాన్ని అభివర్ణించే కోణం భిన్నంగా ఉంటుంది,నిజంగా వానమీద పాటలు జానపదాలలో ఎంత కమ్మగుంటాయో..సినిమా పాటలలో అంత చిలిపిగా ఉంటాయి,వో వానమ్మ నువ్వంటే అందరికి ఎంతిష్టముంటే… ఇన్ని పాటలతో ఇన్ని పదాలతో నిన్ను వర్ణిస్తూ…నీలో తడిసి ముద్దై అనుభూతి చెందుతారు చెప్పు.అందుకే వానమ్మ నీకు వందనం.

Related Articles

Leave a reply