తెలంగాణకు 24 టీఎంసీలు ఏపీకి 9.3 టీఎంసీలు

తెలంగాణకు 24 టీఎంసీలు ఏపీకి 9.3 టీఎంసీలు

politics2018-03-08 15:00:00
Share Tweet Google+ Instagram

శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి నీటి విడుదలకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఎట్టకేలకు ఉత్తర్వులు జారీచేసింది. త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలకు అనుగుణంగా రెండు జలాశయాల్లో ఎండీడీఎల్ ఎగువన వాడుకునేందుకు అర్హతగా ఉన్న వాటా మేరకు తెలంగాణకు 24.467 టీఎంసీలు, ఏపీకి 9.3 టీఎంసీల నీటివిడుదలకు ఆదేశిస్తూ బోర్డు సభ్య కార్యదర్శి ఏ పరమేశం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 20 వరకు నాగార్జునసాగర్‌లో 520 అడుగులు, నెలాఖరు వరకు 515 అడుగుల నీటిమట్టం కచ్చితంగా నిర్వహించాలని స్పష్టంచేశారు. అయితే, సాగర్ నుంచి రెండు రాష్ర్టాల అవసరాలకు నీటిని విడుదల చేయాల్సి ఉన్నందున శ్రీశైలం నుంచి కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా నీటిని విడుదల చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది.ఒకవేళ జెన్‌కో తమకు విద్యుత్ అవసరంలేదని స్పష్టం చేసినట్టయితే.. రివర్ స్లూయిజ్‌ల ద్వారా నీటిని విడుదల చేయాలని కూడా పేర్కొన్నది. సాగర్ ఎడమకాల్వ కింద తెలంగాణ, ఏపీ ఒకేసారి నీటిని వినియోగించుకోవడం వల్ల సరఫరా, ఆవిరి నష్టాలు తగ్గించవచ్చని సూచించింది. గతంలో పలుమార్లు ఢిల్లీలో జరిగిన ఒప్పందాల మేరకు బోర్డు తాజాగా జారీచేసిన నీటి విడుదల ఉత్తర్వులను రెండురాష్ర్టాలు అమలు చేయాలని బోర్డు సభ్య కార్యదర్శి అందులో తెలిపారు.

అప్రమత్తంగా వ్యవహరించిన తెలంగాణ నీటిపారుదలశాఖ

ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి తన వాటా కంటే ఎక్కువ వాడుకొని, తిరిగి మరిన్ని టీఎంసీలను మళ్లించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నది. చివరకు బోర్డు త్రిసభ్య కమిటీలో చేసిన నిర్ణయాలకు భిన్నంగా తప్పుడు ప్రచారంచేస్తూ ఎక్కువ నీటిని దక్కించుకొనేందుకు నానా మార్గాలు అనుసరిస్తున్నది. ఆదినుంచి అప్రమత్తంగా ఉన్న తెలంగాణ నీటిపారుదలశాఖ అధికారులు ఎప్పటికప్పుడు బోర్డు అధికారులను సంప్రదిస్తూ ఏపీ ప్రయత్నాలను భగ్నంచేస్తున్నారు. ఈనెల 2న జరిగిన బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో కేవలం జలాశయాల్లోని ఎండీడీఎల్ ఎగువన నీటి నిల్వలనే వాడుకోవాలని డిమాండ్ పెట్టిన తెలంగాణ నీటిపారుదలశాఖ అధికారులు దానిని సాధించడంలో సఫలీకృతులయ్యారు. గత నెల 28న రెండుజలాశయాల్లో ఎండీడీఎల్ ఎగువన 33.770 టీఎంసీల్లో తెలంగాణకు 24.467 టీఎంసీలు, ఏపీకి 9.3 టీఎంసీల మేర వాటా ఉందని బోర్డు తేల్చింది. అయితే సమావేశంలో అందుకు అంగీకరించిన ఏపీ అధికారులు.. ఆ తర్వాత ప్లేటు ఫిరాయించేందుకు ప్రయత్నించారు. గతంలో సమర్పించిన ఇండెంట్ల ప్రకారం తెలంగాణకు 19 టీఎంసీలు, ఏపీకి 26.38 టీఎంసీల నీటి విడుదలకు అంగీకారం జరిగిందంటూ ఒక పత్రికలో తప్పుడు ప్రచారాన్ని కూడా చేయించారు. గత రెండురోజులుగా ఇదేరీతిన నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేయించేందుకు బోర్డులోని ఏపీ ఇంజినీర్లు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీంతో బోర్డు చైర్మన్ వైకే శర్మను కలిసిన తెలంగాణ ఇంజినీర్లు త్రిసభ్య కమిటీ సమావేశంలో జరిగిన నిర్ణయాలను వివరించారు. వాస్తవానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయించడంలో సఫలీకృతులయ్యారు.

Related Articles

Leave a reply